Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి, ఆయనను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాను ఆస్పత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నానని వాంగ్‌చుక్ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. తాను ఆస్పత్రిలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నానని చెప్పారు. సోమవారం నిర్వహించనున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ మార్చ్‌కు తన భార్య గీతాంజలి ఆంగ్మో నాయకత్వం వహిస్తారని ప్రకటించారు.
వాంగ్‌చుక్ తాను చేస్తున్న ఉద్యమాన్ని ‘‘భారత రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’గా అభివర్ణించారు. పేపర్ లీక్ వంటి అన్యాయాల నుంచి స్వేచ్ఛ, నా అక్రమ నిర్భందం వంటి భయాల నుంచి స్వేచ్ఛ కోసం పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహించి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరాహార దీక్ష చేస్తున్నారు. శనివారం(జూలై18)న జంతర్ మంతర్ వద్ద ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు, ఆస్పత్రిలో చేర్పించారు. ఢిల్లీ హైకోర్టు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. మరోవైపు, సఫ్దర్ జంగ్ ఆస్పత్రిపై తమకు నమ్మకం లేదని, మరో ఆస్పత్రికి తన భర్తను తరలించాలని కోరుతూ, వాంగ్‌చుక్ భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.





