Abhishek Nayar: టీమిండియా ఇంగ్లాండ్ టీ20 పర్యటన అత్యంత దారుణంగా ముగిసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లాండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ (BCCI) సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయితే, గత ఏడాది భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ నుంచి తప్పుకున్న మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం అయ్యర్‌కు అండగా నిలిచారు. ఈ సమయంలో కెప్టెన్‌ను మార్చడం వల్ల జట్టులో గందరగోళం పెరుగుతుందే తప్ప ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
జియోహాట్‌స్టార్ (JioHotstar) చర్చా కార్యక్రమంలో అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. “ఒక ఛాంపియన్ జట్టును మరొకరి చేతికి అప్పగించినప్పుడు, అతనికి నచ్చిన జట్టును ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. మొదటిసారి కెప్టెన్ అయిన వ్యక్తి.. ‘నేను జట్టును ఈ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాను’ అని వెంటనే చెప్పలేడు. ముందుగా జట్టును హ్యాండిల్ చేస్తూ అర్థం చేసుకోవాలి. ఈ రెండు సిరీస్‌ల తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. జట్టు నుంచి తనకు ఏం కావాలి, ఆటగాళ్లు ఎలా ఆడాలి, సపోర్ట్ స్టాఫ్ నుంచి ఎలాంటి సాయం కావాలనే విషయాలపై అతను స్పష్టత తెచ్చుకుంటాడు. కాబట్టి, ఇప్పుడే అతని కెప్టెన్సీ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అనడం చాలా తొందరపాటు అవుతుంది” అని పేర్కొన్నారు.
ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు తన ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చి, ఒకసారి ఛాంపియన్‌గా నిలబెట్టిన ట్రాక్ రికార్డ్ అయ్యర్‌కు ఉందని నాయర్ గుర్తుచేశారు. ఈ టీ20 సిరీస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా మొదటి అసైన్‌మెంట్ మాత్రమే కాకుండా, జట్టులోకి అతను పునరాగమనం (కమ్‌బ్యాక్) చేస్తున్న సమయం కూడా కావడంతో ఒత్తిడి సహజమన్నారు. “ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో హ్యారీ బ్రూక్, టెస్ట్ జట్టులో బెన్ స్టోక్స్ లేదా గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఎలాంటి స్వేచ్ఛ, యాజమాన్య హక్కులు దక్కాయో.. అయ్యర్‌కు కూడా అలాంటి సపోర్ట్ ఇవ్వాలి. శుభ్‌మన్ గిల్ కూడా వన్డే కెప్టెన్ అయిన కొత్తలో మొదటి కొన్ని సిరీస్‌లు గెలవలేదు. కాబట్టి ఇప్పుడే పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మేనేజ్‌మెంట్‌లో తొందరపాటు నిర్ణయాలు వద్దు” అని నాయర్ హితవు పలికారు.
షార్ట్ బాల్ బలహీనతపై మేనేజ్‌మెంట్‌కు హెచ్చరిక:
ఈ పర్యటన భారత బ్యాటర్ల బలహీనతలను బయటపెట్టిందని నాయర్ విశ్లేషించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాటర్లను లక్ష్యంగా చేసుకుని నిరంతరం షార్ట్ బాల్స్ వేయడంపై ఆయన స్పందిస్తూ.. “భారత జట్టు కంటే ఇంగ్లాండ్ చాలా మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగింది. పిచ్ పరిస్థితులకు అలవాటు పడటంలో భారత్ విఫలమైంది. అయితే ఆస్ట్రేలియా పరిస్థితులు (రాబోయే వరల్డ్ కప్ వేదిక) భిన్నంగా ఉంటాయి. అక్కడ బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుంది కాబట్టి భారత్ రాణించే అవకాశం ఉంది. ఈ పర్యటన ఆటగాళ్లకు ఒక మంచి మేల్కొలుపు లాంటిది. వరల్డ్ కప్ నాటికి బ్యాటర్లంతా షార్ట్ బాల్స్ ఎదుర్కొనేలా తమ ఆటను మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.





