Kitchen Tips: బంగాళాదుంపలు దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉండే కూరగాయ. కూరలు, పరాటాలు, చాట్‌లు, స్నాక్స్ ఇలా ఎన్నో వంటకాల్లో బంగాళాదుంపలు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఉడికించిన బంగాళాదుంపలతో చేసే వంటకాలకు ప్రత్యేక రుచి ఉంటుంది. అయితే వాటిని ఉడకబెట్టిన తర్వాత తొక్క తీయడం మాత్రం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. వేడి బంగాళాదుంపలను చేతిలో పట్టుకోవడం కష్టంగా ఉండటం, తొక్క సరిగా ఊడకపోవడం వల్ల సమయం కూడా ఎక్కువ పడుతుంది. కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
నిమ్మకాయతో సూపర్ ట్రిక్
బంగాళాదుంపలను ఉడకబెట్టే సమయంలో నీటిలో సగం నిమ్మకాయ లేదా నిమ్మ తొక్క వేయాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంప తొక్క త్వరగా వదులైపోతుంది. ఉడికిన తర్వాత తొక్క చాలా సులభంగా చేత్తోనే ఊడిపోతుంది. అంతేకాకుండా బంగాళాదుంపల రంగు కూడా తాజాగా కనిపిస్తుంది.
ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది
ఉడికించే నీటిలో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల బంగాళాదుంపలు లోపల నుంచి తేలికపాటి రుచిని అందుకుంటాయి. తర్వాత వాటితో చేసే కూరలు, చాట్‌లు, పరాటాలు మరింత రుచిగా తయారవుతాయి.
పసుపు వేస్తే ఆకర్షణీయమైన రంగు
మీరు బంగాళాదుంపలను కూర కోసం ఉడకబెడుతున్నట్లయితే, నీటిలో చిటికెడు పసుపు వేయండి. దీంతో బంగాళాదుంపలకు లేత బంగారు రంగు వచ్చి వంటకం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
వెనిగర్‌తో బంగాళాదుంపలు విరగవు
కొన్నిసార్లు బంగాళాదుంపలు ఎక్కువగా ఉడికి పొడిపొడిగా మారి విరిగిపోతుంటాయి. దీనిని నివారించడానికి నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలపాలి. ఇది బంగాళాదుంపల ఆకృతిని కాపాడటంలో సహాయపడుతుంది.
బే ఆకులు, మిరియాలతో ప్రత్యేక రుచి
చాట్‌లు లేదా స్నాక్స్ కోసం బంగాళాదుంపలను ఉడకబెడుతుంటే, నీటిలో 1-2 బే ఆకులు, కొద్దిగా నల్ల మిరియాలు వేయండి. దీంతో బంగాళాదుంపలకు తేలికపాటి సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది.
తొక్క త్వరగా ఊడిపోవడానికి మరో చిట్కా
బంగాళాదుంపలను ఉడకబెట్టే ముందు వాటి మధ్య భాగంలో కత్తితో ఒక చిన్న గాటు పెట్టండి. ఉడికిన తర్వాత ఆ గాటు దగ్గర నుంచి తొక్క చాలా ఈజీగా ఊడిపోతుంది. ప్రస్తుతం ఈ ట్రిక్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ చిన్న చిన్న కిచెన్ చిట్కాలు పాటిస్తే ఇకపై బంగాళాదుంపల తొక్క తీసే పని చాలా సులభంగా మారిపోతుంది. చేతులు కాలకుండా, సమయం వృథా కాకుండా వంట కూడా త్వరగా పూర్తి చేసుకోవచ్చు.





