Mahanadu: టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. మూడుసార్లు, ఆరేళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. అర్హతను బట్టి ప్రమోషన్ కానీ, వేరే కమిటీల్లోకి కానీ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడులోగా అన్ని జిల్లా కమిటీలు ఏర్పాటు పూర్తి చేయనున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ప్రతీ సైనికుడితోపాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తిరంగా ర్యాలీలు నిర్వహించనున్నాయి.
Read Also: Off The Record: రీఛార్జ్ మోడ్‌లోకి పార్టీ..? వైసీపీ కొత్త గేమ్ ప్లాన్..?
సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఈ అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. నెలవారీగా అందే సంక్షేమ పథకాలపై క్యాలెండర్ రూపకల్పనకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ముందుగానే దీపం పథకం నగదు చెల్లింపులు చేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించారు. ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించనున్నారు. లబ్ధిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో వేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు ఫించన్లు ఇవ్వాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు గత ప్రభుత్వం నిలుపుదల చేసిన ఫించన్లు పునరుద్ధరించనున్నారు. అలాగే… తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు జూన్ 12న ప్రారంభించబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పొలిట్ బ్యూరో డిసైడ్ అయింది.
Read Also: Veeraiah Chowdary Incident: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు.
పొలిట్ బ్యూరో సమావేశంలో సభ్యులంతా పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించలాని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. కడపలో సరైన సౌకర్యాలు లేకపోయినా అక్కడే మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో అభినందనలు తెలిపింది..