Cockroach Janata Party Goes Viral: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది. అదే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP). కేవలం నాలుగు రోజుల క్రితం ఒక వ్యంగ్య (సటైరికల్) వెబ్‌సైట్‌గా మొదలైన ఈ ‘బొద్దింకల పార్టీ’, సోషల్ మీడియాలో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో దేశాన్ని ఏలుతున్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసింది. ఉదయం 8.36 గంటల సమయానికి అందిన లెక్కల ప్రకారం… ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.7 మిలియన్ల (87 లక్షలు) ఫాలోవర్లు ఉంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా 10.2 మిలియన్ల (ఒక కోటికి పైగా) ఫాలోవర్లతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్‌కు 13.2 మిలియన్లు, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఈ కొత్త డిజిటల్ పార్టీ కేవలం 78 గంటల్లోనే 3 మిలియన్ల మార్కును దాటి, మే 20 నాటికి 9 మిలియన్లు దాటేసింది. ఇప్పుడు ఏకంగా పది మిలియన్లు దాటేసి రికార్డులు తిరగరాస్తోంది. బీజేపీ తన ఖాతాలో ఇప్పటివరకు 18 వేలకు పైగా పోస్ట్‌లు పెడితే, కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 56 పోస్ట్‌లతోనే ఈ స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అద్భుతాన్ని చూసి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ… “యువత శక్తిని తక్కువ అంచనా వేయకండి, ‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ’ అని చెప్పుకునే వారిని కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలో దాటేశాం” అంటూ బీజేపీపై గట్టి సటైర్ వేశారు. ప్రస్తుతం గూగుల్‌లో ఈ పార్టీ అధికారిక వెబ్సైట్ ఏది? వ్యవస్థాపకుడు ఎవరు? ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి? అని జనాలు విపరీతంగా వెతుకుతున్నారు.
ఇంతకీ దేశవ్యాప్తంగా యువతను ఇంతలా ఆకర్షిస్తున్న ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. ఈ వెబ్‌సైట్‌ను సృష్టించిన వ్యక్తి పేరు అభిజీత్ దిప్కే (30). ఈయన తనను తాను ఈ పార్టీకి “ఫౌండింగ్ ప్రెసిడెంట్” అని పిలుచుకుంటారు. మే 16న ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక గూగుల్ ఫామ్‌ను షేర్ చేస్తూ, ఈ పార్టీలో చేరాలనుకునే వారు రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. ఈ యువకుడు ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. అంటే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల ఆలోచనలను, రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేయాలో తెలిసిన నిపుణుడు. గతంలో 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేశారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్ (Memes) ఆధారంగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి యువతను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి 2026లో ఈ సరికొత్త వ్యంగ్య రాజకీయ ప్రచారానికి తెరలేపారు.
అయితే, ఈ పార్టీ పుట్టడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఇటీవల మే 15న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ మాట్లాడుతూ… ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు జర్నలిస్టులుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా లేదా సోషల్ మీడియా యూజర్స్‌గా మారి అందరిపై దాడులు (ఆరోపణలు) చేస్తున్నారనే అర్థంలో యువతను “బొద్దింకలు”, పరాన్నజీవులతో పోల్చారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సీజేఐ స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, సందర్భోచితంగా అర్థం చేసుకోలేదని వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యాఖ్యలు ఆన్లైన్ వేదికగా యువత మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. దేశంలో భావప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్నవారే యువతను అలా కించపరచడం ప్రజాస్వామ్యంలో అస్సలు ఆమోదయోగ్యం కాదంటూ అభిజీత్ దిప్కే డిజిటల్ రూపంలో తన నిరసనను వ్యక్తం చేశారు. అలా పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఏకంగా 40,000 మంది ఇందులో సభ్యులుగా చేరారు. అభిజీత్ గూగుల్ ఫామ్ పెట్టిన కొద్ది గంటల్లోనే 5,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అలా ఇంటర్నెట్లో సరదాగా మొదలైన ఒక జోక్, వ్యవస్థపై ఉన్న యువత అసంతృప్తికి వేదికగా మారి ఒక అనధికారిక సంస్థలా రూపాంతరం చెందింది.
ఈ పార్టీ తన వెబ్సైట్లో రాసుకున్న ట్యాగ్‌లైన్, డిమాండ్లు చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. అదే సమయంలో యువతను ఆలోచింపజేస్తుంది. “సోమరులు, నిరుద్యోగుల గొంతుక” (Voice of Lazy and Unemployed) అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పార్టీ… “వ్యవస్థ లెక్కించడం మర్చిపోయిన ప్రజలకు” తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతోంది. ఎటువంటి స్పాన్సర్లు లేని ఈ పార్టీ, తమది ‘ఒక పెద్ద, పట్టుదల గల బొద్దింకల సమూహం’ అని ప్రకటించుకుంది. “మేమిక్కడ మరో పీఎం కేర్స్ (PM CARES) ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి రాలేదు, పన్ను చెల్లింపుదారుల డబ్బుతో దావోస్ (Davos) నగరానికి వెళ్లి సెలవులు గడపడానికి రాలేదు, లేదా అవినీతికి ‘స్ట్రాటజిక్ స్పెండింగ్’ అని కొత్త పేరు పెట్టడానికి రాలేదు.. ప్రజల సొమ్ము ఏమైందో గట్టిగా, రాతపూర్వకంగా, పదే పదే అడగడానికే ఇక్కడికి వచ్చాం” అని వెబ్సైట్లో చాలా ఘాటుగా రాశారు.
ఈ పార్టీ విడుదల చేసిన 5 పాయింట్ల మేనిఫెస్టో నేరుగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజకీయ పద్ధతులను ప్రశ్నించేలా ఉంది. అందులోని ముఖ్యాంశాలు ఏంటంటే… కేంద్ర కేబినెట్లోని అన్ని మంత్రి పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించడం. ‘గోదీ మీడియా’గా ముద్రపడిన యాంకర్ల బ్యాంక్ ఖాతాలపై విచారణ జరపడం. అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌పై యూఏపీఏ (UAPA) చట్టం కింద చర్యలు తీసుకోవడం. రిటైర్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ పదవులు ఇవ్వకుండా నిరోధించడం. వీటితో పాటు సీబీఎస్ఈ (CBSE) బోర్డు పేపర్ రీచెకింగ్ కోసం వసూలు చేసే ఫీజులను ‘అడ్డగోలు అవినీతి’గా అభివర్ణిస్తూ, ఆ ఫీజులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఇటీవల నీట్ (NEET) పరీక్ష వివాదంలో నష్టపోయిన విద్యార్థులకు ఈ పార్టీ మద్దతు ప్రకటించింది. త్వరలోనే యువత భాగస్వామ్యంతో ఒక వర్చువల్ ‘జెన్-జీ’ (Gen-Z) సదస్సును సైతం నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ పార్టీలో చేరడానికి పెట్టిన అర్హతలు కూడా చాలా వింతగా ఉన్నాయి… “నిరుద్యోగి అయి ఉండాలి, సోమరితనంతో ఉండాలి, క్రానిక్‌గా (ఎప్పుడూ) ఆన్లైన్లోనే గడపాలి. ప్రొఫెషనల్‌గా సుదీర్ఘంగా వాదించే/ఫిర్యాదు చేసే (Rant) నైపుణ్యం ఉండాలి” అని సరదాగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రేజ్ కేవలం సామాన్య యువతకే పరిమితం కాలేదు, దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ నాయకురాలు మహువా మోయిత్రా వంటి వారు సోషల్ మీడియాలో ఈ పార్టీకి మద్దతుగా నిలిచారు. టీఎంసీ నేత కీర్తి ఆజాద్ అయితే ఒకడుగు ముందుకు వేసి ‘ఎక్స్’ లో… “నేను కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నాను, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి?” అని ప్రశ్నించారు. దానికి ఈ పార్టీ స్పందిస్తూ… “1983 వరల్డ్ కప్ గెలవడం అనేది ఇందులో చేరడానికి చాలా మంచి అర్హత” అని అదిరిపోయే రిప్లై ఇచ్చింది.





