ఏపీలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు పబ్లిక్ సర్వీసెస్ విభాగంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డైరెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా.. పరిపాలనా పరమైన కారణాల రీత్యా ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం.. విశాఖపట్నం జీవీఎంసీలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బి.శంకర రావును సాలూరు మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. అదేవిధంగా.. ప్రస్తుతం గుత్తి మున్సిపల్ కమిషనర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు చూస్తున్న కావలి మున్సిపాలిటీ మేనేజర్ కేటగిరీ-III ఎన్.సురేంద్రను గుత్తి మున్సిపల్ కమిషనర్‌గా పూర్తిస్థాయిలో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన డి.రాంబాబును డిప్యుటేషన్ ప్రాతిపదికన సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ప్రారంభంలో ఒక సంవత్సర కాలానికి ఆయన సొంత వేతన నిబంధనలకు లోబడి, విదేశీ సేవా నిబంధనల ప్రకారం ఉంటుందని ఆ ఉత్తర్వులలో వివరంగా పేర్కొన్నారు.
ఈ పరిపాలనాపరమైన బదిలీల ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాల మేరకు, ఆయన పేరు మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అధికారికంగా జారీ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డైరెక్టర్ ఈ విషయమై తదుపరి అవసరమైన చర్యలు అన్నీ వెంటనే తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ జీవో ప్రతిని సమాచారం నిమిత్తం అకౌంటెంట్ జనరల్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, వ్యక్తులకు పంపడం జరిగిందని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.





