Pakistan: బ్రహ్మోస్‌కు పోటీగా పాకిస్తాన్ అభివృద్ధి చేసిన ‘‘ఫతా-4’’ క్రూయిజ్ మిస్సైల్‌ను ఆ దేశం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేలకు సమాంతరంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపణి, శత్రు దేశాల రాడార్ వ్యవస్థకు చిక్కదు. ఫతా-4 క్షిపణిని పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ డెవలప్ చేసింది. భూమి నుంచి ప్రయోగించే ఈ క్రూయిజ్ మిస్సైల్‌లో అత్యాధునిక ఏవియానిక్స్, నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ క్షిపణి సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని పాకిస్తాన్ చెబుతోంది.
ఫతా-4 క్షిపణి 750 కిలో మీటర్ల పరిధిని కలిగి ఉంది. 330 కిలోగ్రాములు ఉన్న వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని పరిధిలోకి భారత్‌లోని పలు ప్రాంతాలు వస్తున్నాయి. దీనిని పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్ కోట్ నుంచి ప్రయోగిస్తే ఢిల్లీని కూడా టార్గెట్ చేయగలదు. పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్, పఠాన్‌కోట్, జమ్మూ కాశ్మీర్‌లోని జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్, హర్యానాలోని హిసార్, సిర్సా, అంబాలా, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్, బికనీర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో, ఆగ్రా, మీరట్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి.





