జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. చరిత్రలోనే భారత్ ఎన్నడూ లేనివిధంగా అత్యుత్తమంగా నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు శనివారంతో ముగియగా, మునుపటి రికార్డులన్నింటినీ తిరగరాస్తూ భారత్ ఏకంగా 114 పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. గతంలో 2022 హాంగ్జౌ ఆసియా పారా గేమ్స్‌లో భారత్ సాధించిన 108 పతకాలే ఇప్పటివరకు అత్యుత్తమ రికార్డుగా ఉండేది. కానీ, ఈసారి ఆ రికార్డును బద్దలు కొడుతూ భారత్ పతకాల సంఖ్యను 114కి పెంచింది.
పోటీల చివరి రోజు వరకు నాల్గవ స్థానం కోసం దక్షిణ కొరియా నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. దక్షిణ కొరియా తమ పతకాల సంఖ్యను 100కి చేర్చినప్పటికీ, ఆ దేశం కేవలం 29 స్వర్ణాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్ కంటే ఒక స్వర్ణ పతకం వెనుకబడిపోవడంతో, దక్షిణ కొరియా ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే ఇరాన్ 26 స్వర్ణాలతో ఆరవ స్థానంలో నిలిచింది.
ఈ పతకాల పట్టికలో చైనా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, ఆతిథ్య జపాన్ రెండవ స్థానంలో, ఉజ్బెకిస్తాన్ మూడవ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత భారత్ నాల్గవ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, కజాకిస్తాన్, సౌదీ అరేబియా దేశాలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, షూటింగ్ వంటి విభాగాలలో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి దేశం గర్వపడేలా చేశారు. చిన్న జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ, గత రికార్డులను పూర్తిగా బద్దలు కొట్టి పారా క్రీడారంగంలో భారత్ తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.





