28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?

Date:

Multiplex Business: చిన్నప్పుడు అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని, ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసి చీకటిగా, చల్లగా ఉండే సినిమా హాల్లోకి అడుగుపెట్టిన జ్ఞాపకం అందరికీ ఉండే ఉంటుంది. లైట్లు ఆరిపోవడం, వెండితెరపై మనకు నచ్చిన హీరో ఎంట్రీ ఇవ్వడం.. ఒక్కసారిగా మనం ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాం. సినిమా హాల్ అనేది ఒక మాయా ప్రపంచం. కానీ ఈ మాయ వెనుక ఒక పక్కా బిజినెస్ స్టోరీ ఉంది. థియేటర్ల లైట్లు వెలగాలన్నా, అక్కడ పాప్‌కార్న్ టబ్‌లు నిండాలన్నా ఒక తెలివైన ఆర్థిక చక్రం తిరగాల్సిందే. మరి సినిమా హాల్స్‌లో సంపాదన గుట్టు ఏంటో ఇక్కడ ముచ్చటగా తెలుసుకుందాం..

టికెట్ మ్యాజిక్: మీ 200 రూపాయలు ఎక్కడికి వెళ్తాయి?

మనం సాధారణంగా మల్టీప్లెక్స్‌కు వెళ్లి టికెట్ కోసం రూ.200 (లేదా అంతకంటే ఎక్కువ) వెచ్చిస్తాం. ఆ డబ్బులన్నీ థియేటర్ వాళ్ల జేబులోకే వెళ్తాయని అనుకుంటే పొరపాటే. మనం ఇచ్చే డబ్బులో మొదటగా ప్రభుత్వానికి జీఎస్టీ (GST) రూపంలో పన్ను వెళ్తుంది. పన్నులు పోగా మిగిలిన మొత్తాన్ని ‘నెట్ కలెక్షన్’ అంటారు. ఈ నెట్ కలెక్షన్‌లో అసలైన పంపకాలు మొదలవుతాయి. ఓ పెద్ద సినిమా విడుదలైన మొదటి వారంలో వచ్చే వసూళ్లను థియేటర్ యాజమాన్యం (ఎగ్జిబిటర్), డిస్ట్రిబ్యూటర్ (నిర్మాత ప్రతినిధి) చెరో సగం (50-50) పంచుకుంటారు. వారాలు గడుస్తున్న కొద్దీ థియేటర్ వాటా పెరుగుతుంది. ఎందుకంటే సినిమా స్లో అయినా థియేటర్ నడపాల్సిన రిస్క్ వారిదే కాబట్టి. అయితే చెన్నైలోని ప్రముఖ ‘జీకే సినిమాస్’ అధినేత రూబన్ మాధవానన్ చెబుతున్న దాని ప్రకారం.. పెద్ద స్టార్ల సినిమాలకైతే డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 70 శాతం వరకు వాటా తీసుకుంటారు. టికెట్ల ద్వారా వచ్చే డబ్బులు కేవలం థియేటర్ రోజువారీ నిర్వహణ ఖర్చులకే సరిపోతాయట.

హిట్, సూపర్‌హిట్, బ్లాక్‌బస్టర్.. ఈ లేబుల్స్ వెనుక కథేంటి?

ప్రతి శుక్రవారం ట్రేడ్ అనలిస్టులు సినిమా కలెక్షన్ల లెక్కలు మొదలుపెడతారు. కానీ ఒక సినిమా ఎంత వసూలు చేసింది అనే దానికంటే, పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టిందా లేదా అనేదే ముఖ్యం. దీనినే ‘బ్రేక్ ఈవెన్ పాయింట్’ అంటారు. అంటే సినిమా నిర్మాణ ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడి తిరిగి రావాలి. ఆ మార్క్ దాటిన తర్వాతే అసలైన లాభాలు మొదలవుతాయి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 250 కోట్లు వసూలు చేసిన సినిమా.. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చి రూ.600 కోట్లు సాధించిన సినిమా కంటే పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుంది. అందుకే సినిమా ఎంత సంపాదించింది అనేదానికంటే, పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఎంత లాభం తెచ్చింది అనేదే ముఖ్యం. ఇక, ప్రస్తుతం బాలీవుడ్‌లో బడ్జెట్ నియంత్రణ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. నటీనటుల రెమ్యునరేషన్లు, క్యారవాన్లు, లగ్జరీ ప్రయాణాలు, భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్ (VFX) ఖర్చుల వల్ల బడ్జెట్ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. బడ్జెట్ పెరిగే కొద్దీ బ్రేక్ ఈవెన్ మార్క్ సైతం పెరుగుతుంది. అందుకే ‘డాన్ 3’ (Don 3) లాంటి పెద్ద ప్రాజెక్టులు సైతం బడ్జెట్ లెక్కలు తేలక ఆలస్యమవుతున్నట్లు టాక్.

సింగిల్ స్క్రీన్ వర్సెస్ మల్టీప్లెక్స్

సింగిల్ స్క్రీన్ థియేటర్ల రూల్స్ వేరుగా ఉంటాయి. అక్కడ టికెట్ ధరలు తక్కువగా (₹50-₹150) ఉంటాయి. చిన్న టౌన్లలో జనాలు ఎక్కువగా వస్తారు. వారు వాల్యూమ్, మాస్ సినిమాల మీద ఆధారపడి బతుకుతారు. కానీ మల్టీప్లెక్స్ చైన్స్‌కు ఉన్న బార్గెయినింగ్ పవర్ వీరికి ఉండదు. మల్టీప్లెక్స్ సంస్థలు డిస్ట్రిబ్యూటర్లతో ఒకేసారి వందల స్క్రీన్ల ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి వారికి మంచి రెవెన్యూ షేరింగ్ ఒప్పందాలు దక్కుతాయి. సింగిల్ స్క్రీన్లు మాత్రం ప్రతి సినిమాకు విడిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది.

పాప్‌కార్న్: థియేటర్లను బతికించే అసలైన హీరో!

ఇప్పుడు అసలైన మ్యాటర్ లోకి వద్దాం. థియేటర్ ఓనర్ల ముఖంలో అసలైన నవ్వులు పూయించేది సినిమా టికెట్లు కాదు.. ఇంటర్వెల్‌లో అమ్మే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, నాచోస్ మాత్రమే! ఎందుకంటే థియేటర్‌కు కేవలం రూ.30 నుంచి రూ. 40 ఖర్చయ్యే ఓ పాప్‌కార్న్ టబ్‌ను మనకు రూ.150 నుంచి రూ. 400 వరకు అమ్ముతారు. ఇందులో లాభాల మార్జిన్ చాలా ఎక్కువ. రూబన్ అన్నట్లు.. టికెట్ ద్వారా వచ్చే డబ్బులు కరెంట్ బిల్లులు, జీతాలు (Bills) కడితే.. ఫుడ్ అండ్ బెవరేజెస్ (F&B) ద్వారా వచ్చే లాభాలే బిజినెస్‌ను బతికిస్తాయట. ఇక, థియేటర్లు టికెట్ ధరలు పెంచి, స్నాక్స్ ధరలు తగ్గించవచ్చు కదా? అని మనకు అనిపించవచ్చు. కానీ టికెట్ డబ్బుల్లో ఎక్కువ భాగం టాక్సులు, డిస్ట్రిబ్యూటర్ల వాటాలకే పోతుంది. కాబట్టి స్నాక్స్ కౌంటర్ల లాభాలే థియేటర్లలో మంచి ప్రొజెక్టర్లు, ఏసీలు, లగ్జరీ సీట్లు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లు మొత్తం ఆదాయంలో 25-30 శాతం కేవలం ఈ తినుబండారాల నుంచే వస్తుందట. దీనికి తోడు స్క్రీన్‌పై, లాబీలో వేసే అడ్వర్టైజ్‌మెంట్లు అదనపు ఆదాయం సమకూరుతుంది.

ప్రాంతాన్ని బట్టి మారే ఫార్ములా

సినిమా హాల్స్ సంపాదన ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంది. ఉదాహరణకు చెన్నైలోని జీకే సినిమాస్‌లో స్థానిక తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమాలకూ భారీ డిమాండ్ ఉంటుందని రూబన్ చెబుతున్నారు. అలాగే ఈ మధ్య పాత హిట్ సినిమాలను రీ-రిలీజ్ (Re-releases) చేయడం థియేటర్లకు ఒక బంగారు గనిలా మారింది, ఎందుకంటే వీటికి డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. కానీ కరోనా తర్వాత ప్రేక్షకుల ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు చూడటానికి వచ్చే వారు స్నాక్స్ ఎక్కువగా కొనడం లేదని, కేవలం సినిమా చూసి లేదా ఒక వాటర్ బాటిల్ కొని వెళ్ళిపోతున్నారని రూబన్ గమనించారు. థియేటర్ల రద్దీ (Footfalls) అనేది ఆక్సిజన్ లాంటిదైతే.. ఫుడ్ అండ్ యాడ్స్ అనేవి పోషకాహారం (Nutrition) లాంటివని ఆయన చక్కగా వివరించారు. ‘ధురంధర్’ లేదా ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ల కళే మారిపోతుంది.

ఓటీటీ (OTT) రేస్, సవాళ్లు

ప్రస్తుతం థియేటర్ల ముందున్న అతిపెద్ద సవాలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. సినిమా థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో థియేటర్ల కలెక్షన్లు దెబ్బతింటున్నాయి. హీరో సూర్య నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ (Karuppu) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించినప్పటికీ, విడుదలైన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లకు, ఓటీటీ విడుదలకు మధ్య గ్యాప్‌ను 4 వారాల నుంచి 8 వారాలకు పెంచితే.. చిన్న సినిమాలు, మౌత్ టాక్‌తో పుంజుకునే సినిమాలు థియేటర్లలో ఎక్కువ కాలం ఆడి మంచి లాభాలను సాధిస్తాయని ఎగ్జిబిటర్లు కోరుకుంటున్నారు. కాబట్టి, తరువాతి సారి మీరు ఆ మెత్తటి ఎరుపు రంగు సీట్లో కూర్చుని, చేతిలో పాప్‌కార్న్ టబ్ పట్టుకున్నప్పుడు గుర్తుంచుకోండి.. ఆ మాయా ప్రపంచం వెనుక సినిమాను, థియేటర్లను బతికించే ఒక అద్భుతమైన బిజినెస్ నడుస్తోంది!

 

 

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ലെബനന്റെ പരമാധികാരം ഇസ്രഈലിന് മുമ്പില്‍ അടിയറവ് വെക്കുന്ന നീക്കം; ലെബനന്‍-ഇസ്രഈല്‍ കരാര്‍ തള്ളി ഹിസ്ബുല്ല

  ബെയ്‌റൂട്ട്: അമേരിക്കയുടെ മധ്യസ്ഥതയില്‍ ലെബനനും ഇസ്രഈലും തമ്മില്‍ വാഷിങ്ടണില്‍ വെച്ച്...

"அடிச்சு விளையாடுவோம்; ராகுல் காந்தியை பிரதமர் ஆக்குவதே அடுத்த லட்சியம்" – மாணிக்கம் தாகூர் உறுதி

தமிழக காங்கிரஸ் கட்சியின் புதிய தலைவராக மாணிக்கம் தாகூர் எம்.பி. நியமிக்கப்பட்டிருக்கிறார்....

“JUST KANNADA” ಸರಣಿ ವರದಿ : ಫಾಕ್ಸ್ ಡೆನ್ ಬಾರ್ ಅಗ್ನಿ ದುರಂತ, ಕಡೆಗೂ ಅಬಕಾರಿ ಡಿಸಿ ನಾಗರಾಜಪ್ಪ ಅಮಾನತು.

  ಮೈಸೂರು, ಜೂ.27: ಮೈಸೂರಿನ ದಟ್ಟಗಳ್ಳಿಯಲ್ಲಿರುವ ಮಾರಾ ಬಾರ್ ಅಂಡ್ ರೆಸ್ಟೋರೆಂಟ್...