AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకోగా, ఇవాళ కూడా పలుచోట్ల 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 45.6°C ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9°C, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5°C ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మార్కాపురం జిల్లా పెదచెర్లోపల్లి, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, బాపట్ల జిల్లా ఇంకొల్లు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తదితర ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాల పరిధిలోని మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26 మండలాలు, నెల్లూరులో 25, ప్రకాశం జిల్లాలో 23, మార్కాపురం జిల్లాలో 20 మండలాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇక, ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43°C నుంచి 44°C వరకు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 41°C నుంచి 43°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు తీవ్ర వడగాల్పులపై కూడా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 18 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 20 మండలాలు సహా మొత్తం 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 277 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. ఇక, కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.





