కాంగ్రెస్ కంచుకోటలో తేడా రాజకీయం నడుస్తోందా? పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్ళని కాదని ఎవరెవరికో పదవులు ఇస్తున్నారన్న అసంతృప్త స్వరాలు పెరుగుతున్నాయా? ఇన్నాళ్ళు లోలోపల రగిలిపోతున్న వాళ్ళు ఇక ఓపెన్ అవుతున్నారా? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా అసంతృప్త నేతలు? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం. ఆ బలంతోనే…. 2014 ఎన్నికల్లో కేవలం 11 రోజుల ముందు ములుగు నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు పొదెం వీరయ్య. ఆ తర్వాత రకరకాల వత్తిళ్ళు వచ్చినా ఆయన పార్టీ మారలేదని చెప్పుకుంటారు. కానీ… 2023 ఎలక్షన్స్‌లో మాత్రం హస్తం గుర్తు మీద పోటీ చేసిన పొదెం ఓడిపోయారు. అయితే… ఆయన సేవల్ని గుర్తించి అటవీ అభివృద్ది సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. అంత వరకు బాగానే ఉన్నా…. ఇక్కడ మొదటి నుంచి మంత్రి పొంగులేటి ప్రియ శిష్యుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు… ఆయనతోపాటే కాంగ్రెస్‌లో చేరారు. కానీ… అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు.
ఫలితాలు వచ్చిన వెంటనే…. తన రాజకీయ గురువు అయిన పొంగులేటి ఉన్న కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ తర్వాతి నుంచి ఇక భద్రాచలం కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్ జోరందుకున్నట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అసలు సరిపడడం లేదట. నియోజకవర్గంలో…. తెల్లం వెంకట్రావు ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీలోకి వెంట నడిచిన నాయకులు కొందరున్నారు. ప్రస్తుతం పదవులన్నీ వాళ్ళకే వస్తున్నాయట. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో తెల్లం అనుచరులే, ఇసుక కాంట్రాక్ట్‌లు వాళ్ళకేనంటూ మండిపడుతున్నారట పొదెం వీరయ్య అనుచరులు. భద్రాచలంలో ఇసుకకు గోదావరి భారీ వనరు. అందుకే ఆ కాంట్రాక్ట్‌లన్నీ ఎమ్మెల్యే తెల్లం వర్గీయులే కొట్టుకు పోతున్నారని పొదెం వర్గం రగిసిపోతున్నట్టు సమాచారం. అప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉండి మమ్మల్ని ఏడిపించిన వాళ్ళే… ఇప్పుడు పార్టీలో కొచ్చి పెత్తనాలు చేస్తుంటే….మేం చేతులు కట్టుకుని కూర్చోవాలా? అన్ని పదవులతో పాటు… చివరికి ఇందిరమ్మ ఇళ్ళు, ఆ ఇళ్ళ కాంట్రాక్ట్‌లు వాళ్ళకే ఇస్తున్నాంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొదెం. తాజాగా దుమ్ముగూడెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తన ఆక్రోశం వెళ్ళగక్కారట ఆయన. కాంగ్రెస్ ఎవరి జాగీర్ కాదు…. ఇది కార్యకర్తలది… ముందు నుంచి ఉన్నవాళ్ళని కాదని మధ్యలో వచ్చిన బీఆర్‌ఎస్ వాళ్ళకే పదవులు , ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారని ఓపెన్‌గానే అన్నారాయన. మాజీ జడ్పీటీసీకి, భద్రాచలంలో మూడు దేవస్థానాల కమిటీల్లో ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పొదెం. పైకి లేదు లేదంటున్నా… కాంగ్రెస్‌లో పాత కొత్త వివాదం నడుస్తూనే ఉంది. మొదట్నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి న్యాయం జరుగడం లేదన్న ఆవేదన కూడా పెరుగుతోంది. భద్రాచలంలో ఆ డోస్ కాస్త ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ వివాదానికి అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.