Off The Record: మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏం చేయబోతున్నారు? పార్టీ జాతీయ అధ్యక్షుడికి వాళ్ళు ఏం చెప్పారు? అట్నుంచి ఎలాంటి హామీ వచ్చింది? మీ లెక్కలతో మాకేంటి.. మేం చేసిన పనికి గుర్తింపు ఇవ్వండంటున్న నాయకుల్ని పార్టీ పెద్దలు ఏం చెప్పి బుజ్జగించారు?
Read Also: Delhi : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటనా స్థలంలో 13 అగ్నిమాపక యంత్రాలు..
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని భావించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మొదట్లో బుజ్జగించారు. ఆ తర్వాత అగ్రనాయకత్వంతో మాట్లాడించాలని నిర్ణయించింది పార్టీ. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే… అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్‌రావుతో విడివిడిగా భేటీ అయ్యారు ఖర్గే. కష్టకాలంలో కూడా పార్టీ వెంటే ఉన్నా.. వదిలేసి మారి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి.. మమ్మల్ని అవమానించారంటూ… ఖర్గే ముందు కుండబద్దలు కొట్టేశారట ప్రేం సాగర్ రావు. మంత్రి పదవి తప్ప ప్రత్యామ్నాయాలను అంగీకరించబోమని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి… ఆ అవకాశం తనకు ఇవ్వాలని మొదటి నుంచి పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు మల్‌రెడ్డి రంగారెడ్డి. అయితే… రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే పదవులు ఎక్కువయ్యాయంటూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల చుట్టూ రాజకీయం నడుపుతోంది కాంగ్రెస్.
Read Also: IND vs ENG: సెంచరీలతో చెలరేగిన బ్రూక్, స్మిత్.. తేలిపోయిన భారత బౌలర్లు..!
అయితే, తెలంగాణలో సగం జనాభా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం ఏంటని అడిగారట మల్‌రెడ్డి. సామాజిక సమీకరణాల లెక్కలు ఎలా ఉన్నా… కనీసం జిల్లాకు ఒక మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన వాపోయినట్టు సమాచారం. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరారట. బంజారాల ఓటు బ్యాంకు పూర్తిగా కాంగ్రెస్ వెంటే ఉంటుందని.. ఇప్పుడు ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బాలు నాయక్ చెప్పినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తల్ని గుర్తించాలని, నల్గొండ జిల్లా నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరారాయన. బంజారా సామాజిక వర్గాన్ని క్యాబినెట్లోకి తీసుకునే అంశంపై సీరియస్ గా చర్చించాలని ఆయన ఖర్గేకి సూచించినట్టు తెలిసింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రతిపాదన వస్తే.. అధిష్టానం వైపునుంచి బంజారాలకు న్యాయం చేస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్టు తెలిసింది.
మరోవైపు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఖర్గేని కలిశారు. గాంధీభవన్‌లో ఆయన వ్యక్తిగతంగా కలిసి బీసీల నుంచి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని విన్నవించారు. కష్టపడుతున్నాం పదవులు ఇవ్వండి అంటూ కాంగ్రెస్ అధిష్టానం ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్టిగా వాయిస్ వినిపించారట. తగిన గుర్తింపు ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేసే వారి సంఖ్య తగ్గుతుందని, పార్టీలు మారి వచ్చిన వాళ్లకే కొమ్ములొస్తాయని అది లాయల్టీ ఉన్న వాళ్ళని అవమానించినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారట పాత కాంగ్రెస్ నేతలు. అధిష్టానం ఇప్పటికైనా వాళ్ళ మొర ఆలకిస్తుందో లేదో చూడాలంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు.