20
June, 2026

A News 365Times Venture

20
Saturday
June, 2026

A News 365Times Venture

Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?

Date:

Off The Record: తిరుపతి జిల్లా ​సత్యవేడు నియోజకవర్గ తమ్ముళ్ల మధ్య నడిచిన హైడ్రామా చూస్తుంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం మరోసారి రుజువైందని అంటున్నారు. నిన్నటి వరకు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పరస్పరం నిప్పులు చెరిగిన నేతలు.. ఇప్పుడు ఒకే ఆఫీసులో, పక్కపక్కనే కూర్చుని నవ్వులు పూయిస్తున్న ఫోటో జిల్లాలో హాట్ టాపిక్ అయింది. సరిగ్గా నెల క్రితం వరకు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఎంత పీక్స్‌లో చేరిందంటే, ఏకంగా కోట్లాది రూపాయల లెక్కల్ని ప్రెస్ మీట్లలో బయటపెట్టుకున్నారు. కానీ… ఇప్పుడీ సీన్‌ చూసి… ఇంతలోనే అంత మార్పు ఏంటబ్బా… తెర వెనక ఏం జరిగింది? అంటూ సొంత పార్టీ నాయకులే ఆరా తీస్తున్నారు.ఈ పరిణామం వెనుక అసలు కథ ఏంటన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ సబ్జెక్ట్ అయింది. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కోనేటి ఆదిమూలం. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. రాసలీలల వీడియో వ్యవహారం ఆయన రాజకీయ జీవితాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. హైకోర్టు పరిధిలో ఆ వివాదం సద్దుమణిగినట్లు కనిపించినా.. టీడీపీ అధిష్ఠానం మాత్రం ఆదిమూలం మీద విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదు.

దీంతో ఆ వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇదే సమయంలో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన సత్యవేడుకు అగ్రవర్ణ నేత అయిన శంకర్ రెడ్డిని కో-ఆర్డినేటర్‌గా నియమించడం
వాళ్ళకు మరింత ఆగ్రహం తెప్పించింది. తమ ప్రాధాన్యతను తగ్గించేందుకే ఇలా చేస్తున్నారని భావించిన ఎమ్మెల్యే కుమారుడు కోనేటి సుమన్.. కో-ఆర్డినేటర్ శంకర్ రెడ్డి టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ఎన్నికల్లో కోట్లు అప్పులు చేసి ఖర్చు పెట్టాం, అధికారం వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టారు.. మా డబ్బులు మాకు తిరిగి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ బహిరంగంగానే అన్నారు. దాదాపు 40 వేల మెజారిటీతో గెలిచినా తమ కుటుంబానికి పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. అలాగే… నియోజకవర్గంలో కోట్లాది రూపాయల గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా సాగుతోందని ఆరోపణలు చేశారు. నాడు అలా మాట్లాడిన సుమన్… సీన్ కట్ చేస్తే.. తాజాగా తిరుపతిలోని టీడీపీ ఆఫీసులో అదే శంకర్ రెడ్డి సమక్షంలో బీఎల్ఏ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిందట. ​ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటంటూ రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల ఖర్చు లెక్కలను రచ్చకీడ్చిన ఎమ్మెల్యే తనయుడిపై టీడీపీ అధిష్ఠానం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇప్పుడు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారట. ఆయనకి ప్రస్తుతం పార్టీలో కీలక పదవి ఇచ్చి, ఆనాడు లేవనెత్తిన నగదు లెక్కలను క్లోజ్ చేశారా అని వాళ్ళలో వాళ్లు ప్రశ్నించుకుంటున్నారు.

దీనికి తోడు, సత్యవేడు నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాల్లో సర్దుబాట్లు జరిగి ఉంటాయని సొంత కార్యకర్తలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో కో-ఆర్డినేటర్ పట్టు పెరిగిపోతుండటం.. మరోవైపు పొలిటికల్ రీ-ఎంట్రీకి వేరే మార్గాలు లేకపోవడంతో.. సర్దుబాటు బాట పట్టడమే ఉత్తమమని ఎమ్మెల్యే వర్గం భావించినట్టు కనిపిస్తోందన్న వాదన సైతం ఉంది. అధిష్ఠానం పెద్దల జోక్యంతోనో, లేక లోకల్ దందాల వాటాల అండర్‌స్టాండింగ్‌తోనో మొత్తానికి సీన్ మాత్రం రివర్స్ అయిందని అంటున్నారు. కారణం ఏదైనాసరే… నిన్నటి వరకు శత్రువుగా చూసిన శంకర్ రెడ్డి చేతుల మీదుగానే సుమన్ కుమార్ పార్టీ పదవిని అందుకోవడం విశేషం. ఈ నవ్వులు, పదవుల పంపకాలు సత్యవేడు టీడీపీలో అసమ్మతిని పూర్తిగా చల్లారుస్తాయా.. లేక లోపల రగులుతున్న కేడర్ అసంతృప్తి భవిష్యత్తులో సరికొత్త గొడవలకు దారితీస్తుందా అనేది వేచిచూడాలంటున్నారు పరిశీలకులు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മലപ്പുറം ജില്ല വിഭജിക്കുകയല്ല, മലബാറില്‍ ഒരു കേന്ദ്ര ഭരണപ്രദേശമാണ് വേണ്ടത്: വിശ്വ ഹിന്ദു പരിഷത്ത്

തിരുവനന്തപുരം: മലപ്പുറം ജില്ല വിഭജിക്കുന്നതിന് പകരം മലബാര്‍ കേന്ദ്ര ഭരണ പ്രദേശമാക്കണമെന്ന്...

`மாநகராட்சியே நாசமா போச்சு’ | சாயம் வெளுத்த மேயர், துணை மேயர்; வேலூர் திமுக-வில் மோதல்!

வேலூர் மாநகராட்சியின் நிர்வாக சொதப்பல்களால் பல்வேறு பணிகளில் குளறுபடிகள் இருப்பதாகக் குற்றச்சாட்டுகள்...

Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..

Siddipet District: సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత ఘోరమైన ఉదంతం...

ಪಾದಚಾರಿ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವುದು ಮೂಲಭೂತ ಹಕ್ಕು- ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್

ನವದೆಹಲಿ,ಜೂನ್,20,2026 (www.justkannada.in): ಸಾರ್ವಜನಿಕ ರಸ್ತೆಗಳಲ್ಲಿನ ಪಾದಚಾರಿ ಮಾರ್ಗಗಳಲ್ಲಿ (ಫುಟ್‌ಪಾತ್‌) ಸುರಕ್ಷಿತವಾಗಿ...