తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ప్రధాని మోడీకి కీలక లేఖ రాశారు. దేశంలోని టెక్స్‌టైల్ రంగాన్ని, ముఖ్యంగా లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు పత్తిపై ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. పత్తి, నూలు ధరలు భారీగా పెరగడంతో టెక్స్‌టైల్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ప్రస్తుతం ముడి సరుకు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.
‘‘భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్, దుస్తుల ఎగుమతి రాష్ట్రం తమిళనాడు. ఈ రంగంపై లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఇది ప్రధాన ఉపాధి వనరు. అయితే ఇటీవల పత్తి ఉత్పత్తి తగ్గడం, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరిగాయి” అని విజయ్ పేర్కొన్నారు.
గత రెండు నెలల్లోనే పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక క్యాండీ పత్తి ధర రూ.54,700 నుంచి రూ.67,700కు చేరిందన్నారు. అలాగే నూలు ధర కిలోకు రూ.301 నుంచి రూ.330కు పెరిగిందని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అందుబాటులో ఉండాలంటే దిగుమతులు తప్పనిసరి అవుతున్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతం పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం ఉండటం పరిశ్రమపై మరింత భారం పెడుతోందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్‌టైల్ పరిశ్రమేనని, ముఖ్యంగా మహిళల ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
“పత్తి దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తే పరిశ్రమకు ముడి సరుకు కొరత తీరుతుంది. అలాగే ఎగుమతులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో పోటీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. లక్షలాది ఉద్యోగాలు కూడా రక్షించబడతాయి” అని సీఎం విజయ్ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే 0 శాతానికి తగ్గించాలని ప్రధాని జోక్యం చేసుకోవాలని సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు.
பருத்திக்கான இறக்குமதி வரியை ரத்து செய்ய வலியுறுத்தி
மாண்புமிகு இந்தியப் பிரதமர் திரு. நரேந்திர மோடி அவர்களுக்கு,
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச.ஜோசப் விஜய் அவர்களின் கடிதம்.#CMJosephVijay pic.twitter.com/99CEc6rys8— CMOTamilNadu (@CMOTamilnadu) May 14, 2026





