పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. గ్యాస్, చమురు లభించక ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్‌కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా భారతదేశాన్ని గుర్తుచేశారు. భారతదేశానికి అనుమతి ఇచ్చినట్లుగానే మాకు కూడా రాయితీ ఇవ్వాలని వేడుకుంది.
ఇంధన సంక్షోభం తీవ్ర కావడంతో రష్యా ఇంధన కొనుగోలు ఆంక్షలపై మినహాయింపు ఇవ్వాలని అమెరికాను కోరింది. భారతదేశానికి మంజూరు చేసినటువంటి మినహాయింపులనే కోరింది. రష్యా డీజిల్ కొనుగోలుపై తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారతదేశానికి అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపును జారీ చేసింది. అయితే తమకు రెండు నెలల అవసరాలకు సరిపడా డీజిల్ కావాలని, దానిని రష్యా నుంచి కొనుగోలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ అమెరికాకు తెలిపింది.
భారతదేశానికి ఇచ్చినటువంటి మినహాయింపునే బంగ్లాదేశ్ కూడా కోరింది. దీని ప్రకారం గరిష్టంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల రష్యన్ డీజిల్‌ను దిగుమతి చేసుకోవచ్చని ప్రతిపాదించినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
సుమారు 175 మిలియన్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్.. ఇంధన అవసరాల్లో దాదాపు 95 శాతం కోసం దిగుమతులపై ఆధారపడుతుంది. ఈ కొరతను తీర్చడానికి ప్రభుత్వ సంస్థలు ప్రపంచ మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అమెరికా, రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, అంగోలా, ఆస్ట్రేలియాతో సహా సాధ్యమైన ప్రతిచోట నుంచి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రస్తుతం తన భాగస్వాముల నుంచి కూడా దిగుమతులను పెంచుతోంది. బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఏప్రిల్‌లో భారతదేశంలోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. ఇరాన్ యుద్ధం ఇంధన మార్కెట్‌ను మరింతగా కుదిపేయవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.





