17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

Date:

Chairmans Desk : ఇరాన్‌-అమెరికా యుద్ధాన్ని…ప్రపంచంలో యుద్ధ రంగ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు ఎవరికి వాళ్లు ఇష్టమొచ్చిన కోణంలో విశ్లేషిస్తున్నారు. అమెరికా ఆ దేశ సన్నిహిత మిత్రుడైన ఇజ్రాయెల్ ఇరాన్‌ మీద తెగబడ్డాయి. అందుకు ప్రతిదాడిగా ఇరాన్‌ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి ప్రారంభించింది. ఆంబోతులా కుమ్ములాటల మధ్య లేగదూడలు నలిగిపోయినట్లు…అమెరికా-ఇరాన్‌ యుద్ధంలో యూనైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌…దుబాయ్, అబుదాబీ, షార్జాతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్‌ , కువైట్‌, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే…పాతిక 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యాయి. ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న దేశాలు…ఇరాన్‌ అరాచకానికి బలైపోయాయి. అమెరికాతో స్నేహం చేసిన ఫలితం…ఈ దేశాలు తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

అమెరికా, ఇజ్రాయెల్‌… ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్రస్థాయి ప్రాదేశిక రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ పోరు ఇతర గల్ఫ్‌ దేశాలకూ, సముద్ర రవాణా మార్గాలకూ, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని గేమ్‌ థియరీ కోణంలో విశ్లేషించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పాత్రధారీ తన ప్రత్యర్థులు, మిత్రుల స్పందనను అంచనా వేస్తూ పావులు కదపడమే గేమ్‌ థియరీ. కానీ అమెరికా మాత్రం అత్యంత సున్నితమైన గల్ఫ్ ప్రాంతం భద్రతను గాలికొదిలేసి.. ఇరాన్‌పై గుడ్డిగా యుద్ధం మొదలుపెట్టింది. ఆ ముందుచూపు లేని పోకడలే ఇప్పుడు గల్ఫ్ కొంప ముంచుతున్నాయి. గల్ఫ్‌ దేశాలు బహ్రెయిన్‌, ఇరాక్‌, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ. అంటే.. మొత్తం ఏడు దేశాల సముహం గల్ఫ్‌. ఈ ఏడు దేశాల సముహంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువు యూనైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్. యూఏఈలో అబుదాబీ, దుబాయ్, షార్జా, ఉమ్ అల్ కువెన్, హుజైరా, అజ్మాన్, రస్‌ అల్‌ ఖైమా…ఈ ఏడు ప్రాంతాలు గల్ఫ్‌ ఆర్థిక కేంద్రాలు. యుఏఈలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబాయ్, అబుదాబీ ప్రాంతాలు ఇరాన్‌ క్షిపణి దాడులకు ఇప్పుడు విలవిలలాడుతున్నాయి. యూఏఈపై అటాక్‌ చేయడం ద్వారా గల్ఫ్‌ ఎకానమీని ఇరాన్‌ దారుణంగా దెబ్బతీసింది. యూఏఈలో ప్రధాన భాగమైనటువంటి అబుదాబీ, దుబాయ్‌ అద్భుతమైన ప్రాంతాలు. చివరికి అమెరికా పంచన చేరి…అమెరికాతో స్నేహం చేసి…గల్ఫ్‌ దేశాలు అన్యాయం అయిపోయాయి.

సాధారణంగా రెండు పక్షాలు కొట్లాడుకుంటే మూడో పక్షానికి లాభమని అంటుంటారు. కానీ అందుకు భిన్నంగా గొడవతో ఏమాత్రం సంబంధం లేని మూడో పక్షానికే దెబ్బలు పడితే? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో గల్ఫ్ దేశాల పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఆ దేశాలు నలిగిపోతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్న తరుణంలో ఇరాన్ కూడా గట్టిగానే బదులు చెబుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌ తీవ్రంగా దాడులు చేస్తోంది. వాటిని ధ్వంసం చేయడానికి వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. ముఖ్యంగా చమురు ఉత్పత్రి కేంద్రాలు, రిఫైనరీలతో పాటు నౌకలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవడం ఆ దేశాలను కలవరపెడుతోంది. యుద్ధం మొదలు పెట్టడమే తప్ప ముగించడం ఎవ్వరి చేతుల్లో ఉండదు. అందులోనూ అది ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకు అమెరికా, ఇజ్రాయెల్‌- ఇరాన్ యుద్ధమే ప్రత్యక్ష ఉదాహరణ. చూస్తుంటే పశ్చిమాసియాలో రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇరాన్‌పై మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్‌ కూడా డ్రోన్ల దండుతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలు గల్ఫ్‌ దేశాలకు ఆశనిపాతంగా మారుతున్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకున్నా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనాల్సిన పరిస్థితి గల్ఫ్‌ దేశాలది. మరోవైపు చమురు, గ్యాస్ ఉత్పత్తి కూడా ఆగిపోవడంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. దీంతో అయోమయ స్థితిలో ఉన్నారు అక్కడి పాలకులు.

మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలై రెండు వారాలు అవుతోంది. ఇంకా ఇరు పక్షాలు దాడులను తీవ్రతరం చేసుకుంటూనే ఉన్నాయి. మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని హతమార్చి టెహ్రాన్‌కి చెక్ పెట్టొచ్చని భావించిన ట్రంప్‌నకు భంగపాటు ఎదురైంది. ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించడాన్ని అగ్రరాజ్యం ఊహించలేకపోయింది. ఫలితంగా పశ్చిమాసియ రావణకాష్ఠంలా మారింది. అయితే, ఇక్కడ అందోళనకర విషయం ఏంటంటే ఇరాన్‌ గల్ఫ్‌ కంట్రీస్‌పై దాడి చేయడమే. మరి, ఇరాన్ ఎందుకు కొన్ని గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుందంటే టెహ్రాన్‌ అమెరికాపై ప్రత్యక్ష్యంగా దాడి చేయలేదు. అందుకు కారణం ఇరాన్-అమెరికా మధ్య దూరం దాదాపు 10 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులకు అమెరికాపై దాడి చేసేంత సామర్థ్యం లేదు. టెహ్రాన్ దగ్గరున్న టాప్ మోస్ట్‌ మిస్సైల్స్ 2 నుంచి 3 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని మాత్రమే చేధించగలవు. అందుకే తమ చుట్టూ ఉన్న అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే, ఈ మధ్య కాలంలో తాము 10 వేల కి.మీ రేంజ్ కలిగిన క్షిపణులు ప్రయోగించినట్లు టెహ్రాన్‌ చెబుతోంది. దానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు.

ఇరాన్‌ సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌పై కూడా డ్రోన్లతో విరుచుకు పడుతోంది. అయితే, ఇజ్రాయెల్ దగ్గరున్న గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్‌ డోమ్ వాటిని సమర్థంగా అడ్డుకుంటోంది. కాబట్టి గల్ఫ్‌లోని ఖతార్, బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపైనా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ విరుచుకుపడింది. ఎందుకంటే, అమెరికా ప్రాంతీయ భద్రతా చట్రంలో భాగంగా ఇవి అగ్రరాజ్య స్థావరాలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. అందులో భాగంగా గల్ఫ్ దేశాల్లో 8 శాశ్వత సైనిక స్థావరాలు ఉన్నాయి. 11 ఇతర కీలక సైనిక యూనిట్లు ఉన్నాయి. మొత్తంగా 19కి పైగానే సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ పశ్చిమాసియా అంతటా నిఘా కార్యకలాపాలు, నౌకాదళ మోహరింపులు, యుద్ధ విమానాల ప్రయాణాలకు వీలుకల్పిస్తున్నాయి. వీటి ఆధారంగానే తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిందిందనేది ఇరాన్ వాదన. అందుకే, వాటిని లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడులకు దిగుతోంది.

పశ్చిమాసియా యుద్ధంలో గల్ఫ్ దేశాలు లక్ష్యంగా మారడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. భౌగోళిక స్థానం, ఇంధన వనరులు, అంతర్జాతీయ రాజకీయాలు. ఈ గల్ఫ్ దేశాలు ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతాలను ప్రభావితం చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం సులభమవుతుంది. అదీకాకుండా ఈ దేశాలకు అమెరికా, ఐరోపా దేశాల మధ్య భద్రతా, రక్షణ ఒప్పందాలున్నాయి. అందుకే వీటిని ఇరాన్ వ్యతిరేక శక్తులుగా భావించవచ్చు. గల్ఫ్​ ప్రాంతంలో ఉన్న చమురు టర్మినళ్లు, పైప్​లైన్లు, రిఫైనరీలు ప్రపంచానికి అత్యంత కీలకమైనవి. ఈ మౌలిక వసతులు దెబ్బతింటే ప్రపంచ చమురు సరఫరా వెంటనే ప్రభావితం అవుతుంది. ఇప్పటివరకు ఇరాన్ దాడులతో తీవ్ర నష్టం బహ్రెయిన్‌కు వాటిల్లింది. బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ బాప్కోకు చెందిన రిఫైనరీ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ క్షిపణులు దాడి చేయడంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో బాప్కో తన కార్యకలాపాలకు సంబంధించి ఫోర్స్‌ మెజ్యూర్‌ ప్రకటించింది. అంటే యుద్ధం వంటి అనివార్య కారణాల వల్ల తాము చమురు సరఫరా ఒప్పందాలను ప్రస్తుతానికి నెరవేర్చలేమని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. ఇక సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు రిఫైనరీ మీద, ఖతార్‌లో కీలక గ్యాస్ రిఫైనరీ మీదా ఇరాన్ బాంబులు వేయడంతో.. చమురు, గ్యాస్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడటమే కాదు.. ఏకంగా నిలిచిపోయింది.

25, 30 ఏళ్ల క్రితమే అబుదాబీ, దుబాయ్‌ మిగిలిన యూఏఈ దేశాలు…తమ ఎకానమీ రూపాన్ని మార్చేశాయి. కేవలం చమురు ఆదాయంపైనే ఆధారపడకుండా తమ ప్రాంతాలను టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్‌, ఎడ్యూకేషన్‌ హబ్, ఐటీ రంగాల టార్గెట్‌ అభివృద్ధి చేశాయి. ఒక దేశాన్ని నిర్మించాలంటే ఎంత కష్టం. పాతిక, 30 ఏళ్లలో అన్ని రకాలుగా అబుదాబీ, దుబాయ్, షార్జా అభివృద్ధి చెందాయి. దుబాయ్…ప్రపంచ విమానయానికి ట్రాన్సిట్‌ సెంటర్‌గా మారింది. అంతేకాదు…ప్రపంచ వాణిజ్యానికి హబ్‌గా మారింది దుబాయ్. ఒక రోల్స్‌ రాయిస్ కారు తయారైతే…దాన్ని మొదట ప్రదర్శించేది దుబాయ్‌లోనే. దుబాయ్‌, అబుదాబీలో ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలను నెలకొల్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్‌లు ఉన్నాయి. వాణిజ్య సంస్థలు సైతం అక్కడే ఉన్నాయి. ఆలయాలను నిర్మించారు. స్వామినారాయణ్‌ టెంపుల్‌ను కట్టారు. క్రైం జీరో రేటు కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ పెట్టుబడులను ఆహ్వానించారు. దుబాయ్, అబుదాబీలో వందరూపాయలు పెడితే…వెయ్యి రూపాయలు అవుతుందని తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని, ఇండియాతో పాటు ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఇన్వెస్టర్లు తరలివచ్చి…లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. హోటల్స్‌, పర్యాటక రంగం అంచనాలకు మించి అభివృద్ధి చెందింది. గల్ఫ్‌ దేశాలంటే ప్రపంచంలోనే అందరికి ఒక నమ్మకం పెరిగింది. పాతికేళ్లు కష్టపడి…ఆ నమ్మకాన్ని జనరేట్‌ చేసుకున్నాయి దుబాయ్, అబుదాబీ లాంటి ప్రాంతాలు. ఈ రోజు భారత్‌ దేశం నుంచి లక్షల మంది స్థిరనివాసం ఏర్పచుకున్నారంటే ఆ ప్రాంతాలపైన ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అందుకే యూఏఈని సేఫ్‌ హెవన్‌ అని పిలుస్తున్నారు. మనుషులకు…వారి ఆస్తులకు., సంపదకు అంతరక్షణ కల్పిస్తాయి కాబట్టే…యూఏఈని అంత అత్యుత్తమ టైటిల్‌తో పిలుస్తారు. అలాంటి గల్ఫ్‌ దేశాలు, యూఏఈ ప్రాంతాలు…అమెరికాతో అంటకాగి…ఇప్పుడు కుదేలయిపోయాయి.

పామ్‌ జుమైరా, బుర్జ్ ఖలీఫా, చుట్టు పక్కల ప్రాంతాలు బాంబు దాడులతో దద్దరిల్లిపోతే…ఇక దుబాయ్ సేఫ్‌ హెవన్ ఎలా అవుతుంది. ఇన్నాళ్లు దుబాయ్‌ను నమ్ముకున్న ఇన్వెస్టర్లు, ఒక్కసారిగా సింగపూర్‌, ఇతర ప్రాంతాలవైపు మళ్లారు. దుబాయ్ లో పెట్టుబడులు పెట్టిన వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అమెరికాతో స్నేహం చేసిన, అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు ఇపుడు యూఏఈ దారుణమైన పరిస్థితులను ఫేస్‌ చేస్తోంది. అబుదాబీ, షార్జా, దుబాయ్, ఖతార్‌, ఇవన్నీ ఒక్క రోజులో ఏర్పడినవి కాదు. ఆ దేశాలు ప్రాంతాల వెనుక మూడు దశాబ్దాల అవిరామ కృషి ఉంది. ఆగ్నేయాసియా దేశాల్లాగా…బ్యాంకాక్, సింగపూర్‌లాగా సహజసిద్ధంగా ఏర్పడిన దేశాలు కావు. ఏడారిలో ఇసుక, చమురు తప్పా మరేమీ లేని దేశాలు. అలాంటి దేశాలను శిల్పం చెక్కినట్లుగా పాతిక 30 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ప్రపంచమంతా నమ్మకం పెట్టుకునే ప్రాంతాలుగా మార్చారు. 70 శాతం ఎయిర్‌లైన్స్‌ను అరబ్ ఏమిరేట్స్‌, ఖతార్ ఎయిర్ వేస్‌, ఇతిహాద్ ఎయిర్‌ వేస్, గల్ఫ్‌ ఎయిర్‌ వేస్… ప్రపంచం మొత్తం 70 శాతం విమానాలను ఈ దేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు తప్పా ఏం లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్‌గార్డెన్స్ పెట్టారు. ఆలయాలు కట్టారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వచ్చాయి. అంతర్జాతీయ బ్యాంక్‌లన్నీ అక్కడే పెట్టారు. వరల్డ్ బెస్ట్‌ షాపింగ్‌ సెంటర్స్‌ నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌ను అభివృద్ధి చేశారు. ఇలా అబ్బురంగా, అపురూపంగా స్వయంగా నిర్మించుకున్న దేశాలు…ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి బలైపోయాయి.

అమెరికా, ఇజ్రాయెల్‌ను నిలువరించాలనే ఉద్దేశంతో హోర్మూజ్ జలసంధిని కూడా మూసి వేసింది ఇరాన్‌. ప్రపంచ చమురు దిగుమతుల్లో 20 నుంచి 25 శాతానికి పైగా ఇక్కడి నుంచి రవాణా అవుతుంది. ఇది గల్ఫ్ దేశాలకు భారీగానే నష్టాన్ని మిగులుస్తోంది. అలాగే, యుద్ధం కారణంగా చమరు ఉత్పత్రి కేంద్రాలు, రిఫైనరీలను కూడా గల్ఫ్ దేశాలు మూసివేశాయి. అలాగే, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు కూడా తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. మొత్తంగా గల్ఫ్ కంట్రీస్‌కు ప్రధాన ఆదాయ వనరులైన గ్యాస్‌, చమురు ఉత్పత్తులు అగిపోవడం ఆయా దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

యుద్ధ పరిస్థితులను చూస్తే యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఎంత నష్టపోతున్నాయో గల్ఫ్ దేశాలు అంతకు మించి నష్ట పోతున్నాయి. క్యాపిటల్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2 శాతం వరకు క్షీణించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే, ఆర్థిక పరిస్థితులు క్షీణించి చమురు ఉత్పత్తి ఏకంగా 15 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఖతార్, కువైట్‌లపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎందుకంటే, అక్కడ పనిచేసే వారిలో చాలామంది విదేశీయులే ఉంటారు. యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది ఆయా దేశాల నుంచి స్వదేశాలకు చేరుకున్నారు. ఒకవేళ యద్ధం ఆగిపోయినా, అంత త్వరగా చమురు ఉత్పత్తి ప్రారంభించడం సులువైన పనికాదు. ఇరాన్ దాడివల్ల పలు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి కూడా. వాటి మరమ్మత్తులకు సమయం పట్టొచ్చు. ఆయా దేశాల్లో స్థానికంగా ఉండే మానవ వనరులు చాలా తక్కువ. అందులోనూ ఉద్రిక్తతల వల్ల విదేశీయులు అంత త్వరగా అక్కడికి రావడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో ఇప్పటికే చాలా దేశాలు గ్యాస్, చమురు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే పనిలో పడ్డాయి.

ఇరాన్, లెబనాన్​, యూఏఈ, యెమెన్​ వంటి దేశాలకు చమురే ప్రధాన వనరు. ఈ దేశాల చమురు ఎగుమతుల్లో మెజారిటీగా భారత్​, చైనాలే దిగుమతి చేసుకుంటున్నాయి. చమురు ఎగుమతి తగ్గిపోతే, ద్రవ్య వినిమయం కూడా తగ్గిపోతుంది. ఇరాన్‌ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో వనరుల ఉత్పత్తి దెబ్బతినడమే కాదు, అక్కడి సెక్యూరిటీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా టూరిజం బాగా తగ్గిపోవచ్చు. పలు గణాంకాల ప్రకారం 27 శాతం వరకు విదేశీ పర్యాటకులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఫలితంగా 56 బిలియన్ డాలర్ల ఆదాయానికి దెబ్బపడే అవకాశం ఉంది. టెక్నాలజీ సామర్థ్యం తగ్గిపోతుంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి. అస్థిరత వల్ల సముద్ర రవాణాపై బీమా ప్రీమియంలు పెరుగుతాయి. ఇది వ్యాపార వ్యయాన్ని పెంచి అంతర్జాతీయ కంపెనీలను పునరాలోచనలో పడేలా చేస్తుంది. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. ఇప్పటికే ఈజిప్టు పౌండ్‌ విలువ డాలర్‌తో పోలిస్తే కనిష్ఠ స్థాయికి చేరుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే తమకు ఎలాంటి సంబంధం లేని యుద్ధం కారణంగా గల్ఫ్ కంట్రీస్‌ తీవ్రమైన నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి.

ఇప్పటికే భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీని వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాలు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. కేవలం అమెరికాతో దశాబ్దాలుగా ఉన్న స్నేహం, భద్రతా ఒప్పందాలే ఇప్పుడు ఆయా దేశాలకు శాపంగా మారాయి. గల్ఫ్ దేశాలు దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న సురక్షితమైన వ్యాపార కేంద్రం అనే ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నది. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలపై దాడులు జరగడం, వేలాది విమానాలు రద్దు కావడంతో పర్యాటక రంగం కుప్పకూలిపోయింది. పెట్టుబడిదారులు ఇప్పుడు గల్ఫ్ నుండి తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండి, ప్రపంచ కుబేరులకు నిలయంగా మారిన ఈ ప్రాంతం, ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతోంది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఒక్కసారిగా ధ్వంసం కావడం ఆయా దేశాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.

గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దాడిచేయడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ మొదట్లో క్షమాపణలు చెప్పారు. గల్ఫ్‌ దేశాలపై ఇకపై ఎలాంటి దాడులూ జరగబోవని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కూడా ఇరాన్ దాడులు ఆగకపోగా.. మరింత ఉధృతమౌతూ వచ్చాయి. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే దుబాయ్ రహదారులు కూడా బోసిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పనిలోపనిగా గల్ఫ్ దేశాలపై దాడులు ఆపటానికి అంతర్జాతీయ సమాజం కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దాడులను ఆపేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌ కో స్పాన్సర్‌గా తీసుకొచ్చిన ఈ తీర్మానానికి ఆమోదం కూడా లభించింది. కానీ, దీన్ని టెహ్రాన్ ఎంత వరకు ఖాతరు చేస్తుందనేది ప్రశ్నార్థకమే. మరోవైపు ఇరాన్‌పై దాడి విషయంలో ఇజ్రాయెల్‌-అమెరికాలు వ్యవహరిస్తున్న తీరుపై కొన్ని గల్ఫ్‌ దేశాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. తమను అప్రమత్తం చేయకుండా ఇరాన్‌పై దాడి చేశాయని ఆరోపిస్తున్నాయి. ఇరాన్‌పై జరిపే దాడి మొత్తం పశ్చిమాసియాలో విధ్వంసానికి కారణం అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే యుద్ధం కారణంగా అన్ని విధాలుగా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయనేది సుస్పష్టం. ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా, జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. సాధారణ పరిస్థితులు రావడానికే చాలా సమయం పడుతుంది. కానీ, ఇంకా రెండు మూడు వారాలు మాత్రం యుద్ధం జరిగితే గల్ఫ్ దేశాలపై ఎంతటి ప్రభావం పడుతుందో అనేది చెప్పడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమాసియాలోని యుద్ధ జ్వాలల సెగకు గల్ఫ్ దేశాలకు పెద్ద ఎదురుదెబ్బే.

ఇజ్రాయెల్ వైరం తమ మెడకు చుట్టుకుంటుందని గల్ఫ్ దేశాలు మొదట్లో భావించలేదు. కానీ, ఎప్పుడైతే వారు పరస్పర దాడులు చేసుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి అప్రమత్తంగా ఉండటం మొదలుపెట్టారు. ముఖ్యంగా సౌది అరేబియా, ఖతార్ దేశాలు అమెరికాతో కొన్ని రక్షణ ఒప్పందాలు చేసుకున్నాయి. సైనిక సహకారం, ఆయుధాల సరఫరా వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే, అంతకు ముందు అబ్రహం అకార్డ్స్ ఒప్పందం ఒకటి జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్, యూఏఈ, బహ్రైన్‌తో పాటు మొరాకో, సూడన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. సైనిక సహకారం, ఇంటిలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలపై ఒప్పందం జరిగింది. కాబట్టి.. ఇరాన్‌తో యుద్ధం వస్తే ఈ దేశాలన్నీ కలిసికట్టుగా దాడులు చేస్తేనే పైచేయి సాధిస్తారు. ఏ ఒక్క గల్ఫ్ దేశానికి ఒంటరిగా దాడి చేసే సత్తా లేదు.

గల్ఫ్ దేశాలకు.. అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ ఒక్కటే బలం. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలతో పోల్చితే.. ఈ దేశాలు దగ్గర ఉన్నవి అత్యాధునికమైనవి. అయితే ఈ దేశాలకు సైనిక బలం తక్కువ. అయితే, మిస్సైల్స్ దాడిని అడ్డుకోగలిగే అడ్వాన్సుడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. సౌదీ అరేబియా దగ్గర F-15, Typhoon ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ ఉంది. UAE వద్ద F-16, Mirage వంటి మోడ్రన్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, అవి కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ సాయంతో పోరాడటమే తప్పా వేరే మార్గం లేదు. పైగా భారీగా నష్టపోయే ఛాన్సులు కూడా ఈ గల్ఫ్ దేశాలకే ఎక్కువ. ఇరాన్ ఇప్పటికే ఆయా దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. గల్ఫ్ దేశాల వద్ద డబ్బులున్నా.. తమని తాము కాపాడుకొనేంత బలమైన సామర్థ్యం మాత్రం లేదు. ఇరాన్ దాడులతోనైనా భవిష్యత్తులో బలపడతారేమో చూడాలి.

గల్ఫ్‌పై ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ దాడుల కంటే.. ఇకపై జరిగే దాడులపై కూడా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడమే దానికి ప్రధాన కారణం. గల్ఫ్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు ఎత్తేయాల్సిందే.. లేదంటే అటాక్ చేస్తూనే ఉంటాం.. ఇది ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఫస్ట్ రియాక్షన్. ఇప్పటివరకు ఇరాన్ అమెరికా యుద్ధం ఆపేస్తే.. తామూ ఆపేస్తామని చెబుతూ వచ్చింది. కానీ మొజ్తాబా చేసిన కొత్త డిమాండ్‌తో గల్ఫ్ దేశాల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. అసలు ఈ డిమాండ్‌కు ఒప్పుకుంటే ఒక తంటా.. లేదంటే మరో తంటా అన్నట్టుగా ఉంది గల్ఫ్ దుస్థితి. ఏ కోణంలో చూసినా గల్ఫ్ భద్రతను కల్లగా మార్చాలని ఇరాన్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పటిదాకా జరిగిన నష్టానికి చింతిస్తున్న గల్ఫ్ దేశాలు.. ఇప్పుడు జరగబోయే నష్టాల్ని ఊహించటానికి కూడా భయపడుతున్నాయి.

సౌదీ, యూఏఈతో పాటు మిగిలిన గల్ఫ్‌ దేశాలన్నీ తిరిగి పునర్‌ వైభవం సంపాదించాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. అన్నిటి కన్నా…ఆ దేశాలకు వచ్చి పోయే వాళ్లలో, అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్లలో నమ్మకం కలిగించడమే యూఏఈకి పెద్ద ఛాలెంజ్. యుద్ధంతో ఏ సంబంధం లేకపోయినా యుద్ధం కాంక్ష లేకపోయినా…కేవలం అమెరికాతో అంటకాగిన దరిద్రానికి పాతికేళ్ల కష్టం…బుగ్గయిపోయింది. అన్నింటి కన్నా, పర్యాటకులు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయింది యూఏఈ. తిరిగి ఆ నమ్మకం ఏర్పడటానికి మరో దశాబ్దకాలం పట్టవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే…మళ్లీ దాడులు జరగకుండా ఉంటే…దుబాయ్, అబుదాబీ లాంటి ప్రాంతాలు…వాటి వైభవాన్ని తిరిగి సంపాదించగలుగుతాయి. కానీ దాడులు ఎప్పుడు ఆగుతాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకవేళ ఆగినా.. ఆయా దేశాల్లో పునర్నిర్మాణం జరగాలంటే డబ్బులు కావాలి. ఆదాయం రావాలంటే చమరుు ఉత్పత్తి, మార్కెట్ పూర్వస్థితికి రావాలి. అసలు చమురు ఉత్పత్తి అంత త్వరగా తిరిగి మొదలవుతుందా.. లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ దాడులు పూర్తిగా ఆగితే కానీ గల్ఫ్ చమురు కేంద్రాలకు జరిగిన వాస్తవ నష్టం, దానికి అయ్యే ఖర్చుపై ఓ క్లారిటీ రాలేదు. ఇవన్నీ తేలేదెప్పుడు..? మాకు మళ్లీ పెట్టుబడులు వచ్చేదెప్పుడు..? వంటి ప్రశ్నలు గల్ఫ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಪೂರೈಕೆ: ಒಂದೆರಡು ವಾರದಲ್ಲಿ ಸಹಜ ಸ್ಥಿತಿಗೆ-ಸಚಿವ ಕೆ.ಹೆಚ್. ಮುನಿಯಪ್ಪ‌

ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್,16,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ ಎಲ್‌ ಪಿಜಿ ಸಿಲಿಂಡರ್ ಕೊರತೆ...

കോണ്‍ഗ്രസ് സംഘപരിവാറിന്റെ ബി ടീമാണെന്ന വസ്തുത വീണ്ടും ശരിവെക്കുന്നു; ബീഹാര്‍-ഒഡീഷ രാജ്യസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: ബീഹാര്‍ രാജ്യസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ നിന്നും കോണ്‍ഗ്രസ് എം.എല്‍.എമാര്‍ വിട്ടുനിന്നതിലും ഒഡീഷയില്‍...

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ವಿತರಣೆಯಲ್ಲಿ ಸಮಸ್ಯೆಯಾದ್ರೆ ಆಹಾರ ನಿರೀಕ್ಷಕರನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ: ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ

ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ, ಮಾರ್ಚ್,16,2026 (www.justkannada.in): ಜಿಲ್ಲೆಯಾದ್ಯಂತ ಎಲ್ ಪಿಜಿ ಸಿಲಿಂಡರ್...