తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. ప్రతి జిల్లా కేంద్రానికి రింగు రోడ్డు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా.. జిల్లాల అభివృద్ధిని కాంక్షిస్తూ చేపడుతున్న ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, సరుకు రవాణాను వేగవంతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి జిల్లా రింగు రోడ్డును సమీపంలోని జాతీయ రహదారులతో అనుసంధానిస్తారు. దీనివల్ల భారీ వాహనాలు పట్టణాల్లోకి రాకుండా నేరుగా హైవేలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి రింగు రోడ్డుకు చేరుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా ‘రేడియల్ రోడ్లను’ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read:Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..
హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (RDC) ను బలోపేతం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ శాఖకు ఉన్న సుమారు 400 ఎకరాల భూమిని ఆర్‌డీసీకి బదలాయించి.. వాటిపై బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తారు.
Also Read:GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..
రాష్ట్రంలో ఇంధన విక్రయాల ద్వారా వచ్చే సెస్సులో 2 శాతం వాటాను నేరుగా ఆర్‌డీసీకి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా నెలకు సుమారు రూ. 400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఇకపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) మాత్రమే కొనుగోలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని పేర్కొన్నారు. రవాణా శాఖలో అవినీతికి తావులేకుండా అన్ని కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేస్తున్నారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం.. రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.





