The Kerala Story 2:‘‘ ది కేరళ స్టోరీ2’’ విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేరళలో ఈ సినిమా వివాదంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా సీపీఎం, ఇతర కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేరళ వ్యాప్తంగా సీపీఎం యువజన విభాగం DYFI, స్టూడెంట్ వింగ్ SFI తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తగా నిరసనలు చేపట్టారు. రాజధాని తిరువనంతపురంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. పరోటా, గొడ్డు కూరను వడ్డిస్తూ నిరసన తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఆగ్రహానికి కారణమైంది.
కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి ‘‘ది కేరళ స్టోరీ 2’’ ఫిబ్రవరి 27న విడుదల కానుంది. కేరళలో హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఇస్లాంలోకి మతమార్పిడి చేస్తు్న్నారనే ఆరోపణ మీద ఈ సినిమాను రూపొందించారు. అయితే, ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీస్తోందని, ఇలాంటివి కేరళలో జరగవని సీపీఎం, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇటీవల సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి, లౌకికవాదాన్ని దెబ్బతీయడానికి ఈ సినిమా రూపొందించారని ఆరోపించారు. కేరళలో అభివృద్ధి, శాంతి భద్రతలు కాపాడుకోవడంలో ముందుందని, ఈ సినిమా కేరళను ఉగ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని, దీనిని సమిష్టిగా తిరస్కరించాని విజయన్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ కూడా ఈ సినిమాను విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు గొడ్డు మాంసం తినాల్సి వస్తుందని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని, మతపరంగా ప్రజల్ని విభజిస్తున్నారని అన్నారు.





