Serial Thief: మధ్యప్రదేశ్‌లో ఒక దొంగ అరెస్ట్ సంచలనంగా మారింది. కేవలం ‘‘పోలీసుల’’ ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఖాండ్వా జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఇళ్లలో దొంగతనం చేస్తున్న అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన దీపేష్ అధికారులకు చిక్కాడు. విచిత్రం ఏంటంటే, 15 ఏళ్ల నాటి పగ తీర్చుకునేందుకు దీపేష్ ఇలా పోలీసు అధికారుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నాడని విచారణలో తేలింది. ఇతడి అరెస్ట్ ను జిల్లా పోలీసులు పెద్ద అచీవ్‌మెంట్‌గా చెబుతున్నారు.
ఎలా దొరికాడు..?
జనవరి 20న ఖండ్వా పోలీస్ లైన్స్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ కరణ్‌పాల్ సింగ్, సురేష్ ఖాటే ఇళ్లలో చోరీ జరిగింది. ఆభరనాలు, నగదు సహా లక్షల రూపాయల విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. దీని తర్వాత విచారణ ప్రారంభమైంది. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తిని పోలీసులు నిందితుడిగా గుర్తించి, వెతకడం ప్రారంభించారు. జహబువా, అలీరాజ్‌పూర్, ధర జిల్లాల్లో్ కూడా పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తరుచుగా ప్రాంతాలు మారుస్తుండటంతో నిందితుడు దీపేష్‌ను అరెస్ట్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
టెక్నికల్ ట్రాకింగ్ ఆధారంగా బుర్హాన్‌పూర్ వైపు వెళ్తుండగా నిందితుడి అరెస్ట్ జరిగింది. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తు్న్నప్పుడు, పైకప్పు నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడి చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించి, కోర్టులో హాజరు పరిచారు.
15 ఏళ్ల పగ-కారణం ఇదే..
స్టేషన్ హౌజ్ అధికారి ప్రవీణ్ ఆర్య నిందితుడి గురించి సంచలన విషయాలు వెల్లడించాయి. 15 ఏళ్ల క్రితం అలీరాజ్‌పూర్‌లో ఒక పోలీస్ అతడిని తీవ్రంగా కొట్టాడని, అప్పటి నుంచి పోలీసులు అంటే పగ పెంచుకుని, వారి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. దీపేష్ ఇప్పటి వరకు 16 మంది పోలీసులు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఉండే ప్రాంతాల్లో వీధి వ్యాపారిగా నటిస్తూ రెక్కీ నిర్వహించి, రాత్రిళ్లు ఇళ్లలో చోరీలు చేసేవాడని చెప్పారు. అయితే, దొంగతనాల్లో సహకరించే రమేష్, భూరాలియా కోసం ఇంకా పోలీసులు వెతుకుతున్నారు.





