Shamar Joseph: టీ20 వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. రికార్డులు, విజయోత్సవాల మధ్య ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే.. తాజాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టు ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలిచింది. ఇది ఆ జట్టుకు వరుసగా నాలుగో గెలుపు. ఇటలీ మొదటిసారి ఈ ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తగ్గేదేలే అన్న రీతిలోనే మొదట దూసుకుపోయింది. పవర్‌ప్లేలోనే బ్రాండన్ కింగ్, షిమ్రోన్ హెట్‌మైర్‌లను ఔట్ చేసి వెస్టిండీస్‌ను కాస్త ఒత్తిడిలోకి నెట్టింది. ఈ సమయంలో కెప్టెన్ షాయ్ హోప్ ఓపికగా ఆడాడు. మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నా కెప్టెన్ మాత్రం చివరివరకు నిలబడి 46 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టును 165 పరుగుల వరకూ తీసుకెళ్లాడు. ఇటలీ బౌలర్లు క్రిషన్, కెప్టెన్ బెన్ మానెంటీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 165 పరుగుల లక్ష్యంతో ఇటలీ గ్రౌండ్‌లోకి దిగింది. ఈ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టినప్పుడు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మోస్కా సోదరులు వేగంగా పరుగులు తీయడానికి ప్రయత్నించారు. కానీ వెస్టిండీస్ బౌలర్లు ఒక్కసారిగా మ్యాచ్ దిశ మార్చేశారు. షమర్ జోసెఫ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తూ 30 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతనికి తోడుగా మాథ్యూ ఫోర్డ్ సైతం 19 పరుగులకు మూడు వికెట్లు తీసి ఇటలీ ఆశలను చెదరగొట్టాడు. చివరకు ఇటలీ జట్టు 18వ ఓవర్‌లోనే మొత్తం ఔట్ అయింది.
READ MORE: Priyanka Gandhi: ‘‘ప్రధాని అవుతావు’’.. ప్రియాంకా గాంధీకి బాబా ఆశీర్వాదం..
అయితే.. ఈ మ్యాచ్‌లో షమర్ జోసెఫ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీయడమే కాకుండా.. నాలుగు క్యాచ్‌లు పట్టి ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి నాలుగు క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇరవై ఓవర్ల ఆటలో నాలుగు వికెట్లు తీసుకోవడం పెద్ద విషయం. నాలుగు క్యాచ్‌లు పట్టడం కూడా చాలా అరుదు. ఈ రెండూ రికార్డులు ఒకే మ్యాచ్‌లో జరగడం దాదాపు అసాధ్యమే. కానీ జోసెఫ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్ కాకుండా నాలుగు క్యాచ్‌లు పట్టిన ప్లేయర్ల జాబితాలో డారెన్ సామీ, ఏడెన్ మార్క్రామ్, గ్లెన్ మాక్స్‌వెల్, జార్జ్ మున్సీతో పాటు ఇప్పుడు షమర్ జోసెఫ్ పేరు చేరింది.





