Off The Record: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా జడలు విప్పింది. నలుగురైదుగురు కూటమి నేతలు ముఠాలుగా ఏర్పడి…. కొండల్ని పిండిచేసి మింగేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అండదండలతో అనుచరులు బరితెగించేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన నియోజకవర్గంలో అక్రమాలకు తావులేదని బత్తుల చేస్తున్న హెచ్చరికలు ఉత్తుత్తి చప్పుళ్ళేనని, తెర వెనక వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తన ఇమేజ్ డ్యామేజ్ అవకుండా బలరామకృష్ణ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారేగానీ… దుమ్ము దులుపుతున్న తన అనుచరుల్ని కట్టడి చేసేందుకు కనీస ప్రయత్నం చేయడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వీళ్ళ దెబ్బకు రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో కొన్ని కొండలు ఇప్పటికే కరిగిపోయాయి. రాజానగరం మండలం కొత్త తుంగపాడులో వెయ్యి మీటర్ల ఎత్తు, కిలోమీటర్ వెడల్పుతో 32 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న కొండ అక్రమార్కులు చేతిలో పడి నామరూపాల్లేకుండా పోయింది. అదే ప్లేస్‌లో ఇప్పుడు పాతాళానికి త్రవ్వేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పరిమితులకు మించి తవ్వేస్తున్నారట. ఇంత జరుగుతున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో పడి కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి.
ఇక సీతానగరం మండలం నల్లగొండ, చీపూరుపల్లి, నాగంపల్లితో పాటు కోరుకొండ మండలం రాఘవపురంలో కూటమి నేతలే ఎర్ర బంగారం దొంగలుగా మారిపోయారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎర్ర గ్రావెల్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో… మాఫియా జూలు విదులుస్తోంది. దొరికిన కాడికి కొండల్ని కుళ్లబొడుస్తూ.. కోట్లు విలువైన గ్రావెల్‌ని అక్రమంగా తరలించేస్తున్నారు. మొక్కుబడిగా.. కొంత క్వాంటిటీకి అనుమతులు తెచ్చుకుని ఇక ఇష్టానుసారం చెలరేగిపోతున్నారట. వాళ్ళ ధాటికి రాజానగరం నియోజకవర్గం మొత్తం మీద 10 కొండలు సగానికి పైగా కరిగిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే…గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రధానంగా గ్రావెల్ దోపిడీనే అస్త్రంగా వాడుకున్నారు. ఎక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించినా… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండల్ని మాయం చేసేస్తున్నారంటూ దుమ్మెత్తి పోసేవారు. కానీ.. తాను ఎమ్మెల్యే గా గెలిచాక ఆయనే…మాఫియాను ప్రోత్సహించి గ్రావెల్ అక్రమ దోపిడీకి రాచబాట వేశారనే ఆరోపణలున్నాయి. అధికారంలోకి వచ్చిన 16 నెలలకే పది కొండల్ని మింగేస్తే… ఇక రాబోయే కాలంలో వీళ్ళేం చేస్తారోనన్న భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయట ఇక్కడి ప్రకృతి ప్రేమికుల్లో. రెండు నుంచి ఐదు ఎకరాల వరకు అనుమతులు తీసుకుని… పది ఎకరాల వరకు మైనింగ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
మైనింగ్ నిబంధనలన్నీ ఈ అక్రమ దోపిడీలో ఆవిరైపోతున్నాయట. రాత్రి పగలు తేడా లేకుండా, భారీ యంత్రాలతో.. మంది మార్బలంతో ఎర్ర బంగారాన్ని దర్జాగా దోచుకుపోతున్నారన్నది స్థానికుల ఆవేదన. గ్రావెల్ వ్యాపారంలో రూపాయికి వంద రూపాయలు వస్తుండటంతో… దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా చెలరేగిపోతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది లారీలు ఎమ్మెల్యే బత్తుల మనుషుల అండదండలతో…రాజమండ్రి, కడియం, కాకినాడ, రావులపాలెం, మండపేట ప్రాంతాలకు వెళ్తున్నాయట. వే బిల్లులు, ఇతర రసీదులూ ఉండవు, అయినాసరే… ఎక్కడా చెకింగ్ ఉండదని తెలిసింది. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు నియోజకవర్గ వాసులు. ఇలాగే అడ్డగోలుగా తవ్వేసుకుంటూ పోతే…. ఇక్కడ ఒకప్పుడు కొండలు ఉండేవని చెప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు.





