Cambodia-Thailand:ఈ ఏడాది కంబోడియా, థాయిలాండ్ మధ్య చిన్నపాటి యుద్ధమే సాగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఇదిలా ఉంటే, థాయిలాండ్ ఇప్పటికీ తమపై ‘‘మానసిక యుద్ధం’’ కొనసాగిస్తోందని కంబోడియా ఆరోపిస్తోంది. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ ఈ ఆరోపణలు చేశారు. జూలై నెలలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. అయినప్పటికీ, థాయిలాండ్ మానసిక యుద్ధంలో పాల్గొంటోందని కంబోడియా మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది.
ప్రస్తుతం, సెనెట్ అధ్యక్షుడిగా ఉన్న హున్ సేన్ అక్టోబర్ 11న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్‌కు పంపిన లేఖను పంచుకున్నారు. థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లో ‘‘మానసిక బెదిరింపులు, వేధింపుల రూపంలో కలవరపెట్టే శబ్ధాలను ఉపయోగిస్తూ మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’ అని లేఖలో పేర్కొన్నారు.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న, అధిక శబ్ధాల వల్ల నిద్రకు అంతరాయం కలిగిస్తున్నారని, మహిళలు, వృద్ధులు, పిల్లలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో చెప్పారు. అక్టోబర్ 10 నుంచి రాత్రిపూట లౌడ్ స్పీకర్ల ద్వారా పిల్లలు ఏడుస్తున్నట్లు, కుక్కలు అరుస్తున్నట్లు, గొలుసుల చప్పుడు, హెలికాప్టర్లు శబ్ధాలను వినిపిస్తున్నారని కంబోడియా మానవ హక్కుల కమిషన్ తన లేఖలో పేర్కొంది.
అయితే ఈ ఆరోపణలపై థాయిలాండ్ స్పందించలేదు. ఈ ఏడాది 5 రోజుల పోరాటం తర్వాత రెండు దేశాలు కాల్పులు విరమణకు అంగీకరించిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు దేశాల ఉద్రిక్తతల్లో 36 మంది మరణించారు. 2 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి పారిపోయారు.





