Off The Record: పార్టీ ఏదైనా, అధికారం ఎవరిదైనా… ఏపీలో ఇప్పుడు కేసులు, కోర్ట్‌లు కామన్ అయిపోయాయి. ఈసారి కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక కూడా…ఇదే తంతు కొనసాగుతోంది. రకరకాల కేసుల్లో ప్రతిపక్ష నేతలు అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళకు బెయిల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొందరు అరెస్ట్, వాళ్ళకు కూడా బెయిల్స్…. ఇలా అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలు మరుగునపడిపోయి.. ఈ కొసరు విషయాల చుట్టూనే జనంలో కూడా చర్చ జరుగుతున్నట్టు కాస్త ఆలస్యంగా గుర్తించిందట టీడీపీ అధిష్టానం. అందుకే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగుచూసిన వాటిలో అన్నిటికన్నా అతిపెద్దది లిక్కర్ స్కామ్ కేసు. దీనికి సంబంధించి అరెస్ట్‌లు, బెయిల్స్ పరంపర నడుస్తూనే ఉంది. అలాగే ముంబై నటి, వల్లభనేని వంశీ నటుడు పోసాని కృష్ణ మురళి… ఇలా ఏడాదిన్నరగా ఇదే ప్రహసనం కొనసాగుతోంది. ప్రధానమైన చర్చలన్నీ వాటి చుట్టూనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన మాటలు మరుగునపడిపోతున్నట్టు పసిగట్టారట కూటమి పెద్దలు.
అందుకే ప్రధానంగా పెద్దన్న పాత్రలో ఉన్న టీడీపీ లీడర్స్, కేడర్‌కు తాజాగా స్పష్టమైన ఆదేశాలు పంపినట్టు సమాచారం. మీరెవరూ ఇక నుంచి అరెస్ట్‌లు, కేసుల గురించి మాట్లాడవద్దు. ఏం చెప్పాలనుకున్నా… పథకాల గురించి చెప్పండంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. మెగా డీఎస్సీ నిర్వహించి అన్నివేల టీచర్ ఉద్యోగాలిస్తే… రావాల్సిన స్థాయి పబ్లిసిటీ రాలేదని, అలాగే వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకువస్తుంటే…వాటి గురించి కూడా ప్రజల్లో చర్చ జరగడం లేదని కాస్త అసహనంగానే ఉన్నారట టీడీపీ పెద్దలు. అందుకే ఇక నుంచి కేసులు, కోర్ట్‌ల వ్యవహారాల గురించి మాట్లాడవద్దని, అవి హైలైట్ అవుతుంటే… చేస్తున్న పనుల్ని చెప్పుకోలేకపోతున్నామని కింది స్థాయికి సందేశాలు పంపారట. అలాగే… తమ పార్టీ నాయకులే…పదే పదే కేసుల గురించి మాట్లాడితే నెగెటివ్ సంకేతాలు బయటికి వెళ్ళి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తగ్గిపోతాయన్న అభిప్రాయం కూడా టీడీపీ పెద్దల్లో ఉన్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలా జరగడం వల్లే… ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళినట్టు భావిస్తున్నారట. అందుకే ఇక నుంచి నెగెటివ్ వ్యవహారాలకు సంబంధించిన చర్చలు లేకుండా చూసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తున్నా, వేల కోట్ల రూపాయల పథకాలు అమలు చేస్తున్నా… అసలు తామెంత చేసినా… ప్రజల్లో కేసులు, అరెస్ట్‌లే రిజిస్టర్ అవుతున్నాయన్న ఆందోళన టీడీపీ పెద్దల్లో ఉందట. అందుకే పునరాలోచనలో పడి ఇక నుంచి పార్టీ నాయకులు ఎవరూ అరెస్ట్‌ల గురించి నోరు విప్పవద్దని ఆదేశించినట్టు తెలిసింది. పార్టీ ఆదేశాలు లేకుండా ఎవ్వరూ నోరు విప్పద్దని, లైన్ దాటడానికి వీల్లేదని కరాఖండీగా చెప్పేశారట. తాజాగా బయటపడ్డ నకిలీ మద్యం వ్యవహారంలో కూడా ఇదే రకమైన..ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. నకిలీ మద్యం కేసు గురించి ఎవరు పడితే వాళ్ళు అనవసరంగా మాట్లాడి లేనిపోని ఇబ్బందులు తేవద్దని చెప్పిందట టీడీపీ అధిష్టానం. మొత్తం మీద చేస్తున్న పనులకు, వస్తున్న మైలేజ్‌కు పొంతనలేకుండా పోతోందన్న అంతర్మథనం మొదలైందట టీడీపీలో. అందుకే దిద్దుబాటు మొదలుపెట్టిందని, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.





